ఆఫ్రికా కొమ్ము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆఫ్రికా కొమ్ము
ఆఫ్రికా కొమ్ము
గ్లోబుపై ఆఫ్రికా కొమ్ము
దేశాలు
4 sovereign states[1]
1 de facto state with limited recognition[2]
జనాభా14,06,83,144 (2020 అంచనా.)
విస్తీర్ణం18,82,757 కి.మీ.2

ఆఫ్రికా కొమ్ము అనేది ఆఫ్రికాలోని ఒక పెద్ద ద్వీపకల్పం.[3] దీన్ని సోమాలీ ద్వీపకల్పం అని కూడా అంటారు. ప్రపంచం లోని అతిపెద్ద ద్వీపకల్పాల్లో నాలుగవ స్థానంలో ఉన్న ఆఫ్రికా కొమ్ము, ఆఫ్రికా ఖండానికి తూర్పు కొసన, ఎర్ర సముద్రానికి దక్షిణం వైపున ఉంది. గల్ఫ్ ఆఫ్ ఏడెన్, సోమాలి సముద్రం, గార్డాఫుయ్ ఛానల్ వరకు వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అరేబియన్ ద్వీపకల్పం, పశ్చిమాసియాలతో దానికి సముద్ర సరిహద్దు ఉంది. ఆఫ్రికా కొమ్ము జిబౌటి, సోమాలిలాండ్, ఎరిట్రియా, ఇథియోపియా, సోమాలియా దేశాలను కలిగి ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది.[4] మరింత విస్తృతంగా చూస్తే కెన్యా, సూడాన్, దక్షిణ సూడాన్, ఉగాండాలు కూడా ఇందులో భాగమేనని చెప్పవచ్చు.[5] గ్రేటర్ ఆఫ్రికా కొమ్ము అనే నిర్వచనం లోకి బురుండి, రువాండా, టాంజానియాలు కూడా వస్తాయి.

పేర్లు

[మార్చు]

ఈ ద్వీపకల్పాన్ని వివిధ పేర్లతో పిలుస్తారు. పురాతన గ్రీకులు, రోమన్లు అక్కడ కనిపించే సుగంధ మొక్కల కారణంగా దీనిని రీరెజియో అరోమాటికా లేదా రీజియో సిన్నమోనిఫోరా అని అనేవారు. స్పష్టంగా తెలియని కారణంగా దీన్ని రీజియో ఇన్‌కాగ్నిటా (అజ్ఞాత భూమి) గా కూడా పేర్కొన్నారు. పురాతన, మధ్యయుగ కాలంలో, ఆఫ్రికా కొమ్మును బిలాద్ అల్ బర్బర్ ("బెర్బర్ల భూమి") అని పిలిచేవారు.[6][7][8] దీనిని సోమాలి ద్వీపకల్పం లేదా సోమాలి భాషలో గీస్కా ఆఫ్రికా, జసిరద్దా సూమాలి లేదా గకంధుల్కా సౌమాలి అని కూడా పిలుస్తారు. [9] ఇతర స్థానిక భాషలలో, దీనిని "ది హార్న్ ఆఫ్ ఆఫ్రికా" లేదా "ది ఆఫ్రికన్ హార్న్" అని పిలుస్తారు: హార్న్ ఆఫ్ ఆఫ్రికా పేరు కొన్నిసార్లు HoA గా కుదించి రాస్తారు. దీనిని "ది హార్న్" అని పిలవడం కూడా సాధారణం. ఇక్కడి ప్రజలను హార్న్ ఆఫ్రికన్లు అని పిలుస్తారు.[10][11] పొరుగున ఉన్న ఈశాన్య ఆఫ్రికా దేశాలను కూడా కలుపుకొని గానీ లేదా ఆఫ్రికా కొమ్ము విస్తృత భౌగోళిక రాజకీయ నిర్వచనాన్ని చిన్నపాటి ద్వీపకల్ప నిర్వచనం నుండి వేరు చేయడానికి గానీ గ్రేటర్ హార్న్ ఆఫ్ ఆఫ్రికా అనే పదాన్ని ఉపయోగిస్తారు. [11] [12]

వివరణ

[మార్చు]

ఆఫ్రికా కొమ్ము ప్రాంతంలో జిబౌటి, ఎరిట్రియా, ఇథియోపియా, సోమాలియా అనే నాలుగు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దేశాలు ఉన్నాయి. [7] [8] [13] [14]

భౌగోళికంగా "కొమ్ము" లాగా పొడుచుకు వచ్చినట్లుండే ప్రాంతంలో "సోమాలి ద్వీపకల్పం", ఇథియోపియా తూర్పు భాగం ఉంటాయి. కానీ మిగిలిన ఇథియోపియా, ఎరిట్రియా, జిబౌటీలను కూడా కలుపుకుని కొమ్ము అంటారు. [15] [16] [17] [18]

చరిత్ర

[మార్చు]

పూర్వ చరిత్ర

[మార్చు]
ఎరిత్రియాలోని డెకా అర్బా డెబుబ్ ప్రాంతంలో డెకా రాక్ ఆర్ట్

ఓమో అవశేషాలు (సుమారు 2,33,000 సంవత్సరాల క్రితం నాటివి), హెర్టో పుర్రె (సుమారు 1,60,000 సం. క్రితం నాటిది) వంటి తొలి హోమో సేపియన్స్ శిలాజాలను ఈ ప్రాంతం లోనే ఉన్న ఇథియోపియాలో కనుగొన్నారు. [19]

2,79,000 సంవత్సరాల క్రితం నాటి అత్యంత పురాతన, రాతి మొనలు కలిగిన ఈటెలను ఇక్కడ కనుగొన్నారు. వీటితో పాటు, "ఇప్పటికే ఉన్న పురావస్తు, శిలాజ, జన్యు ఆధారాలను కలిపి చూస్తే తూర్పు ఆఫ్రికా, ఆధునిక సంస్కృతులు జీవశాస్త్రాలకు మూలస్థానంగా ప్రత్యేకంగా నిలబడుతుంది" [20] [21] [22]

దక్షిణాన మానవ వ్యాప్తి సిద్ధాంతం ప్రకారం, ఆఫ్రికా నుండి బయటికి వెళ్ళిన దక్షిణ ప్రస్థానం, ఆఫ్రికా కొమ్ము లోని బాబ్ ఎల్ మండేబ్ ద్వారా జరిగింది. నేడు బాబ్-ఎల్-మండేబ్ జలసంధి వద్ద, ఎర్ర సముద్రం దాదాపు 20 కిలోమీటర్ల వెడల్పుతో ఉంది. అయితే 50,000 సంవత్సరాల క్రితం ఇది చాలా సన్నగా ఉండేది. ఇప్పటి కంటే అప్పట్లో సముద్ర మట్టాలు 70 మీటర్లు తక్కువగా ఉండేవి. జలసంధి పూర్తిగా ఎండిపోనప్పటికీ, మామూలు తెప్పలను ఉపయోగించి మధ్య మధ్యలో ఉన్న ద్వీపాలను చేరుకోగలిగేలా ఉండి ఉండవచ్చు. ఎరిట్రియాలో 1,25,000 సంవత్సరాల పురాతనమైన నత్త గుల్లల గుట్టలను కనుగొన్నారు. తొలి మానవుల ఆహారంలో సముద్ర తీరానికి దగ్గరలో సేకరించే ఆహారం కూడా ఉండేదని దీన్నిబట్టి తెలుస్తోంది.

సా.పూ. 4000 - 1000 మధ్య ఇథియోపియా, ఎరిట్రియా దేశాల వ్యవసాయంలో విత్తనాల గడ్డి, టెఫ్ ఉండేదని తెలుస్తోంది. [23] ఇంజెరా / టైటా అనే ఫ్లాట్‌బ్రెడ్ తయారు చేయడానికి ఈ టెఫ్‌ను ఉపయోగిస్తారు. కాఫీ కూడా ఇథియోపియా లోనే ఉద్భవించింది. ఆ తరువాత అది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. [24]

పురాతన చరిత్ర

[మార్చు]

సోమాలియా, జిబౌటి, ఎర్ర సముద్రం తీరంలోని ఎరిట్రియా, సుడాన్‌లతో కూడిన ప్రాంతాన్ని పురాతన ఈజిప్షియన్లు పుంట్ (లేదా "టా నెట్‌జెరు," అంటే దేవుడి భూమి) అనేవారు. దీని మొదటి ప్రస్తావన సా.పూ. 25వ శతాబ్దానికి చెందినది. [25]

డి ' మ్ట్ అనేది ఎరిట్రియా, ఉత్తర ఇథియోపియాలలో విస్తరించి ఉన్న ఒక రాజ్యం. ఇది క్రీ. పూ. 8వ, 7వ శతాబ్దాలలో ఉనికిలో ఉంది. బహుశా యెహా రాజధానిగా ఈ రాజ్యం నీటిపారుదల పథకాలను అభివృద్ధి చేసింది. నాగలిని ఉపయోగించారు. తృణధాన్యాలు పండించారు. ఇనుప పనిముట్లు, ఆయుధాలను తయారు చేసారు. క్రీ పూ 5 వ శతాబ్దంలో డమ్ట్ పతనం తరువాత, ఈ పీఠభూమి చిన్న చిన్న రాజ్యాల ఆధిపత్యంలోకి వచ్చింది. 1 వ శతాబ్దంలో ఈ రాజ్యాలలో ఒకటైన అక్సుమైట్ రాజ్యం ఈ ప్రాంతాన్ని తిరిగి ఏకీకృతం చేసింది. [26]

అక్సుమ్ వద్ద ఉన్న కింగ్ ఎజానా స్టేలా. ఇది అక్సుమైట్ నాగరికతకు చిహ్నంగా ఉంది.

అక్సుమ్ రాజ్యం (అక్సుమైట్ సామ్రాజ్యం అని కూడా పిలుస్తారు) ఎరిట్రియా, ఇథియోపియా పర్వత ప్రాంతాలలో ఉన్న ఒక పురాతన రాజ్యం. ఇది క్రీ. శ. 1వ, 7వ శతాబ్దాల మధ్య అభివృద్ధి చెందింది. రోమన్ సామ్రాజ్యం, పురాతన భారతదేశాల మధ్య వాణిజ్యంలో ప్రధాన పాత్ర పోషించిన అక్సుమ్ పాలకులు తమ సొంత కరెన్సీని ముద్రించడం ద్వారా వాణిజ్యాన్ని సులభతరం చేశారు. అప్పటికీ క్షీణదశలో ఉన్న కుష్ రాజ్యంపై కూడా ఈ రాజ్యం తన ఆధిపత్యాన్ని స్థాపించింది. అరేబియా ద్వీపకల్పంలోని రాజ్యాల రాజకీయాల్లో కలగజేసుకుంటూ ఉండేది. చివరికి హిమ్యారైట్ రాజ్యాన్ని జయించడంతో ఈ ప్రాంతంపై తన పాలనను విస్తరించింది. ఎజానా ఆధ్వర్యంలో (320 - 360) అక్సుం రాజ్యం క్రైస్తవ మతాన్ని స్వీకరించిన మొదటి ప్రధాన సామ్రాజ్యంగా మారింది. పర్షియా, రోమ్, చైనాలతో పాటు ఆ కాలంలోని నాలుగు గొప్ప శక్తులలో ఒకటిగా దీన్ని మణి పేర్కొన్నాడు.

ఎరిథ్రియన్ సముద్రపు పెరిప్లస్ ప్రకారం ఆఫ్రికా కొమ్ము, అరేబియా ద్వీపకల్పాలలోని పురాతన వాణిజ్య కేంద్రాలు

కొమ్ములో సోమాలియా ఒక ముఖ్యమైన లింకు. ఈ ప్రాంతపు వాణిజ్యాన్ని మిగిలిన పురాతన ప్రపంచంతో సోమాలియా కలిపేది. సోమాలి నావికులు, వ్యాపారులు గుగ్గులు, సుగంధ ద్రవ్యాలను విక్రయించేవారు. ఇవన్నీ పురాతన ఈజిప్షియన్లు, ఫోనిషియన్లు, మైసెనియన్లు, బాబిలోనియన్లు, రోమన్లకు విలువైన విలాసాలు. [27] [28] తత్ఫలితంగా రోమన్లు ఈ ప్రాంతాన్ని రీజియో అరోమాటికాగా పేర్కొనడం ప్రారంభించారు. సాంప్రదాయ యుగంలో, ఒపోన్, మోసిలాన్, మలావో వంటి అనేక అభివృద్ధి చెందుతున్న సోమాలి నగర-దేశాలు కూడా సుసంపన్నమైన ఇండో - గ్రీకో-రోమన్‌లతో వాణిజ్యం చేయడంలో సబాయన్లు, పార్థియన్లు, ఆక్సుమైట్‌లతో పోటీ పడ్డాయి. [29]

కొమ్ము యొక్క ఎర్ర సముద్ర తీరానికి ఆవలి ఒడ్డున ఇస్లాం పుట్టుక జరిగింది. దీంతో అరేబియా ద్వీపకల్పంలో నివసిస్తున్న స్థానిక వ్యాపారులు, నావికులు అప్పటికే మతం మారిన తమ అరబ్, ముస్లిం వ్యాపార భాగస్వాముల ద్వారా క్రమంగా కొత్త మత ప్రభావంలోకి వచ్చారు. ఇస్లాం ప్రారంభ శతాబ్దాలలో ఇస్లామిక్ ప్రపంచం నుండి కొమ్ముకు ముస్లిం కుటుంబాలు వలస రావడం, తరువాతి శతాబ్దాలలో ముస్లిం పండితులు స్థానిక జనాభాను శాంతియుతంగా మతం మార్చడం మొదలైనవాటితో పురాతన నగర-రాజ్యాలు చివరికి ఇస్లామిక్ మొగాదిషు, బెర్బెరా, జైలా, బర్బర నాగరికతలో భాగమైన బరావా మెర్కా లుగా మార్పు చెందాయి. [30] [31] మొగాదిషు నగరం "సిటీ ఆఫ్ ఇస్లాం" [32] గా పేరుబడింది. అనేక శతాబ్దాల పాటు అది తూర్పు ఆఫ్రికా బంగారు వ్యాపారాన్ని నియంత్రించింది. [33]

మధ్య యుగం, ప్రారంభ ఆధునిక యుగం

[మార్చు]
1540లో అడాల్ సుల్తానేట్ గరిష్ట స్థాయికి చేరుకుంది

మధ్య యుగాలలో, అడాల్ సుల్తానేట్, అజురాన్ సుల్తానేట్, జాగ్వే రాజవంశం, గెలీడి సుల్తానేట్‌లతో సహా అనేక శక్తివంతమైన సామ్రాజ్యాలు కొమ్ము లోని ప్రాంతీయ వాణిజ్యపై ఆధిపత్యం చెలాయించాయి.

896 లో స్థాపించబడిన షోవా సుల్తానేట్, పురాతన స్థానిక ఇస్లామిక్ రాజ్యాలలో ఒకటి. ఇది మధ్య ఇథియోపియాలోని పూర్వ షెవా ప్రావిన్స్‌లో కేంద్రీకృతమై ఉంది. 1285 లో ఇఫాత్ సుల్తానేట్ పరిపాలనను చేజిక్కించుకున్నాడు. సోమాలిలాండ్‌లోని జైలా రాజధానిగా ఇఫాత్ రాజ్యం పాలించబడింది. ఇది మాజీ షేవా సుల్తానేటుకు తూర్పు కొసన ఉన్న జిల్లా. [34]

భౌగోళికం

[మార్చు]

భూగర్భ శాస్త్రం, వాతావరణం

[మార్చు]
1993 మేలో నాసా అంతరిక్ష నౌక నుండి చూసినపుడు ఆఫ్రికా కొమ్ము. ఈ చిత్రంలోని నారింజ, ట్యాన్ రంగులు పొడి నుండి పాక్షిక పొడి వాతావరణాన్ని సూచిస్తాయి.

ఆఫ్రికా కొమ్ము, భూమధ్యరేఖ, కర్కట రేఖల నుండి దాదాపు సమాన దూరంలో ఉంది. ఇది ప్రధానంగా, గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ఏర్పడినపుడు పైకి లేచిన పర్వతాలతో కూడుకుని ఉంది. టర్కీ నుండి మొజాంబిక్ వరకు భూమి పైపెంకులో ఏర్పడిన పగులును గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ అంటారు. ఆఫ్రికన్., అరేబియన్ టెక్టోనిక్ ప్లేట్ల విభజనను ఇది సూచిస్తుంది. ఎక్కువగా పర్వతప్రాంతాలు గల ఈ ప్రాంతం రిఫ్ట్ వ్యాలీ వల్ల ఏర్పడిన లోపాల ద్వారా ఉద్భవించింది.

భూగర్భవిజ్ఞాన పరంగా సుమారు 1.8 కోట్ల సంవత్సరాల క్రితం కొమ్ము, యెమెన్ లు ఒకే భూఖండం నుండి ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఏడెన్ గల్ఫ్, కొమ్ము ప్రాంతాన్ని అరేబియా ద్వీపకల్పం నుండి వేరు చేసింది.[35][36] సోమాలి ఫలకానికి పశ్చిమాన తూర్పు ఆఫ్రికన్ చీలిక సరిహద్దుగా ఉంది. ఇది అఫార్ పల్లం లోని ట్రిపుల్ జంక్షన్ నుండి దక్షిణానికి విస్తరించి ఉంది. ఉత్తర సరిహద్దుగా సౌదీ అరేబియా తీరం వెంబడి ఉన్న ఏడెన్ రిడ్జ్, తూర్పు సరిహద్దుగా సెంట్రల్ ఇండియన్ రిడ్జ్ ఉన్నాయి. సెంట్రల్ ఇండియన్ రిడ్జ్ ఉత్తర భాగాన్ని కార్ల్స్‌బెర్గ్ రిడ్జ్ అని కూడా పిలుస్తారు. దక్షిణ సరిహద్దుగా నైరుతి భారత శిఖరం ఉంది.

కొమ్ము లోని పల్లపు ప్రాంతాలు భూమధ్యరేఖకు సమీపంలో ఉన్నప్పటికీ సాధారణంగా పొడిగా ఉంటాయి. ఎందుకంటే సాహెల్, సూడాన్‌కు కాలానుగుణ వర్షాలను ఇచ్చే ఉష్ణమండల రుతుపవనాల గాలులు పశ్చిమం నుండి వీస్తాయి. పర్యవసానంగా, అవి జిబౌటీ, సోమాలియా ఉత్తర భాగానికి చేరుకోవడానికి ముందే తేమను కోల్పోతాయి. దీని ఫలితంగా కొమ్ములో ఎక్కువ భాగం వర్షాకాలంలో తక్కువ వర్షపాతం పొందుతుంది.

ఆఫ్రికా కొమ్ము. నాసా చిత్రం

ఇథియోపియా పర్వతాలలో, అనేక ప్రాంతాల్లో 2,000 mమీ. (79 అం.) కంటే ఎక్కువ వర్షపాతం ఉంటుంది. అస్మారాలో కూడా సగటున 570 mమీ. (22 అం.) ఉంటుంది . ఈ వర్షపాతం ఈజిప్టుతో సహా ఇథియోపియా వెలుపల ఉన్న అనేక ప్రాంతాలకు ఈ వర్షపాతమే ఏకైక నీటి వనరు. శీతాకాలంలో ఈశాన్య వాణిజ్య గాలులు ఉత్తర సోమాలియాలోని పర్వత ప్రాంతాలలో మినహా మరెక్కడా తేమను అందించవు. ఇక్కడ శరదృతువు చివరిలో 500 mమీ. (20 అం.) వరకు వర్షపాతాన్ని అందిస్తుంది. తూర్పు తీరంలో వార్షిక వర్షపాతం 50 mమీ. (2.0 అం.) కంటే తక్కువగా ఉంటుంది .

సోమాలియా వాతావరణంలో కాలానుగుణ వైవిధ్యం అంతగా ఉండదు. ఆవర్తన రుతుపవనాలు, క్రమరహిత వర్షపాతంతో పాటు వేడి పరిస్థితులు ఏడాది పొడవునా ఉంటాయి. సగటు రోజువారీ గరిష్ట ఉష్ణోగ్రతలు 28 నుండి 43 °C (82 నుండి 109 °F) ఉంటాయి. తూర్పు సముద్ర తీరం వెంబడి ఎత్తైన ప్రదేశాలలో మాత్రం, సముద్రంపై నుండి వచ్చే చల్లని గాలులు వీస్తాయి. సోమాలియాలో జుబ్బా, షబెలే అనే రెండు శాశ్వత నదులు మాత్రమే ఉన్నాయి. ఈ రెండూ ఇథియోపియన్ మెట్ట ప్రాంతాల్లో ప్రారంభమవుతాయి. [37]

జనాభా, జాతులు, భాషలు

[మార్చు]
కుషిటిక్ భాషలు మాట్లాడే జాతి సమూహాల మ్యాప్

భౌగోళిక సారూప్యతతో పాటు, ఆఫ్రికా కొమ్ము లోని దేశాలు చాలా వరకు భాషాపరంగా జాతిపరంగా ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉన్నాయి, [13] వివిధ సమూహాల మధ్య ఉండే పరస్పర సంబంధాల సంక్లిష్ట నమూనాను చూడవచ్చు. [38] కొమ్ము లోని రెండు ప్రధాన స్థూల సమూహాలు -సాంప్రదాయకంగా పల్లపు ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉన్న కుషిటిక్-మాట్లాడే కుషిటిక్ ప్రజలు, మెరక ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఇథియోసెమిటిక్-మాట్లాడే ఇథియోపియన్ హైలాండర్లు, ఎరిట్రియన్ హైలాండర్లు .

ఎథ్నోలాగ్ ప్రకారం, జిబౌటీలో 10 భాషలు (రెండు స్థానికం), ఎరిట్రియాలో 14, ఇథియోపియాలో 90, సోమాలియాలో 15 (సోమాలీ మాత్రమే స్థానిక భాష) ఉన్నాయి. [39] కొమ్ము లోని చాలా మంది ప్రజలు కుషిటిక్, సెమిటిక్ లేదా ఓమోటిక్ శాఖల ఆఫ్రోసియాటిక్ భాషలను మాట్లాడతారు. ఇథియోపియాలోని ఒరోమో ప్రజలు మాట్లాడే ఒరోమో, సోమాలియా, జిబౌటి, ఇథియోపియా, కెన్యాల్లోని సోమాలి ప్రజలు మాట్లాడే సోమాలి లు కుషిటిక్ శాఖలో భాగం; సెమిటిక్ శాఖ (ప్రత్యేకంగా ఇథియోసెమిటిక్ ఉప శాఖ)లో ఇథియోపియాలోని అమ్హారా ప్రజలు మాట్లాడే అమ్హారిక్, ఇథియోపియా లోని టిగ్రిన్యా ప్రజలు, ఎరిట్రియాలోని టిగ్రిన్యా ప్రజలు మాట్లాడే టిగ్రిన్యా ఉన్నాయి. గణనీయ సంఖ్యలో మాట్లాడే ఇతర ఆఫ్రోసియాటిక్ భాషల్లో కుషిటిక్ అఫర్, సాహో, హదియా, సిదామో, అగావ్ భాషలు, సెమిటిక్ టైగ్రే, అరబిక్, గురేజ్, హరారి, సిల్ట్, అర్గోబ్బాఉన్నాయి. [40] అలాగే ఇథియోపియా దక్షిణ ప్రాంతాలలో నివసించే ఓమోటిక్ కమ్యూనిటీలు మాట్లాడే ఓమోటిక్ భాషలు ఉన్నాయి. ఈ యాసలలో ఆరి, డిజి, గామో, కఫా, హామర్, వోలాయిట్టా ఉన్నాయి . [41]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]
ఇథియోపియా కాఫీ బీన్స్

IMF ప్రకారం, 2010లో ఆఫ్రికా కొమ్ము ప్రాంతం మొత్తం జిడిపి (PPP) $106.224 బిలియన్లు, నామినల్ జిడిపి $35.819 బిలియన్లు. 2010లో తలసరి GDP $1061 (PPP), $358 (నామినల్). [42] [43] [44] [45]

ఈ ప్రాంతంలో 95% పైగా సరిహద్దు వాణిజ్యం అనధికారికమైనది, పత్రాలు లేనిది. పశువుల వ్యాపారులు ఈ వాణిజ్యం చేస్తారు. ఇథియోపియా నుండి పశువులు, ఒంటెలు, గొర్రెలు, మేకల అనధికారిక వ్యాపారం కొమ్ములోని ఇతర దేశాలతోను, తూర్పు ఆఫ్రికా ప్రాంతంలోని ఇతర దేశాలతోనూ జరుగుతుంది. దీని మొత్తం విలువ సంవత్సరానికి US$250, US$300 మిలియన్ల మధ్య ఉంటుందని (అధికారిక అంచనాకు ఇది 100 రెట్లు) అంచనా. సోమాలిలాండ్‌లోని బురావో, యిరోవే పట్టణాలు కొమ్ములో అతిపెద్ద పశువుల మార్కెట్‌లకు నిలయంగా ఉన్నాయి. ఆఫ్రికా కొమ్ము నలుమూలల నుండి ప్రతిరోజూ 10,000 గొర్రెలు, మేకలు ఇక్కడ అమ్ముడవుతున్నాయి. వీటిలో చాలావరకు బెర్బెరా నౌకాశ్రయం ద్వారా గల్ఫ్ దేశాలకు రవాణా అవుతాయి. [46][47][48][49] ఈ వాణిజ్యం ఆహార ధరలను తగ్గించడానికి, ఆహార భద్రతను పెంచడానికి, సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి, ప్రాంతీయ సమైక్యతను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.[46] అయితే, క్రమబద్ధీకరించబడని, పత్రాలు లేని ఈ వాణిజ్యం వలన జాతీయ సరిహద్దుల్లో వ్యాధులు మరింత సులభంగా వ్యాపించడం వంటి ప్రమాదాలను కలిగిస్తుంది. ఇంకా, కోల్పోతున్న పన్ను రాబడి, విదేశీ మారకపు రాబడుల పట్ల ప్రభుత్వాలు అసంతృప్తిగా ఉన్నాయి.[46]

ఇవి కూడా చూడండి

[మార్చు]

సూచనలు

[మార్చు]
  1. Encyclopædia Britannica, inc, Jacob E. Safra, The New Encyclopædia Britannica, (Encyclopædia Britannica: 2002), p.61: "The northern mountainous area, known as the Horn of Africa, comprises Djibouti, Ethiopia, Eritrea, and Somalia."
  2. Michael Hodd, East Africa Handbook, 7th Edition, (Passport Books: 2002), p. 21: "To the north are the countries of the Horn of Africa comprising Somalia, Ethiopia, Eritrea, Djibouti, and Somaliland."
  3. Robert Stock, Africa South of the Sahara, Second Edition: A Geographical Interpretation, (The Guilford Press; 2004), p. 26
  4. "List of Largest Peninsulas of the World". Archived from the original on 2022-10-19. Retrieved 2023-07-09.
  5. "Horn of Africa". Encyclopædia Britannica Online. Chicago, Illinois: Encyclopædia Britannica, Inc. Retrieved 2022-04-04.
  6. J. D. Fage, Roland Oliver, Roland Anthony Oliver, The Cambridge History of Africa, (Cambridge University Press: 1977), p.190
  7. 7.0 7.1 George Wynn Brereton Huntingford, Agatharchides, The Periplus of the Erythraean Sea: With Some Extracts from Agatharkhidēs "On the Erythraean Sea", (Hakluyt Society: 1980), p.83
  8. 8.0 8.1 John I. Saeed, Somali – Volume 10 of London Oriental and African language library, (J. Benjamins: 1999), p. 250.
  9. Ciise, Jaamac Cumar. Taariikhdii daraawiishta iyo Sayid Maxamad Cabdille Xasan, 1895–1920. JC Ciise, 2005.
  10. Teklehaimanot, Hailay Kidu. "A Mobile Based Tigrigna Language Learning Tool." International Journal of Interactive Mobile Technologies (iJIM) 9.2 (2015): 50–53.
  11. 11.0 11.1 Schmidt, Johannes Dragsbaek; Kimathi, Leah; Owiso, Michael Omondi (2019-05-13). Refugees and Forced Migration in the Horn and Eastern Africa: Trends, Challenges and Opportunities (in ఇంగ్లీష్). Springer. ISBN 978-3-030-03721-5.
  12. Schreck, Carl J., and Fredrick HM Semazzi. "Variability of the recent climate of eastern Africa." International Journal of Climatology 24.6 (2004): 681–701.
  13. 13.0 13.1 Sandra Fullerton Joireman, Institutional Change in the Horn of Africa, (Universal-Publishers: 1997), p.1: "The Horn of Africa encompasses the countries of Ethiopia, Eritrea, Djibouti, and Somalia. These countries share similar peoples, languages, and geographical endowments."
  14. Felter, Claire (February 1, 2018). "Somaliland: The Horn of Africa's Breakaway State". Council on Foreign Relations. Archived from the original on 21 November 2020. Retrieved March 24, 2021. It covers approximately two million square kilometers (770,000 square miles) and is inhabited by roughly 115 million people (Ethiopia: 110 million, Somalia: 15.8 million, Eritrea: 6.4 million, and Djibouti: 921.8 thousand).
  15. Aweis A Ali (May 2021). "A Brief History of Judaism in the Somali Peninsula" – via ResearchGate.
  16. "Horn of Africa". 4 June 2021. Archived from the original on 25 October 2022. Retrieved 13 August 2022.
  17. "Britannica School". Archived from the original on 25 October 2022. Retrieved 13 August 2022.
  18. Eliezer Wangulu (6 September 2007). "Somalia: Africa Insight - Why Talk in Hotels Won't Yield Long Term Peace". The Nation. Nairobi. Archived from the original on 8 June 2008. Retrieved 25 August 2022 – via AllAfrica.
  19. (Jan 2022). "Age of the oldest known Homo sapiens from eastern Africa".
  20. Sahle, Yonatan (2013-11-13). "Earliest Stone-Tipped Projectiles from the Ethiopian Rift Date to >279,000 Years Ago".
  21. Cavalazzi, B. (2019-04-01). "The Dallol Geothermal Area, Northern Afar (Ethiopia)—An Exceptional Planetary Field Analog on Earth".
  22. Maslin, Mark (2017-01-18). The Cradle of Humanity: How the changing landscape of Africa made us so smart (in ఇంగ్లీష్). Oxford University Press. ISBN 978-0-19-100971-6.
  23. David B. Grigg (1974). The Agricultural Systems of the World. C.U.P. p. 66. ISBN 9780521098434. Retrieved 25 July 2013.
  24. Engels (21 March 1991). Plant Genetic Resources of Ethiopia. Cambridge University Press. ISBN 9780521384568.
  25. Simson Najovits, Egypt, trunk of the tree, Volume 2, (Algora Publishing: 2004), p.258.
  26. Pankhurst, Richard K.P. Addis Tribune, "Let's Look Across the Red Sea I", 17 January 2003 (archive.org mirror copy)
  27. Phoenicia, pg. 199.
  28. Rose, Jeanne, and John Hulburd, The Aromatherapy Book, p. 94.
  29. Vine, Peter, Oman in History, p. 324.
  30. David D. Laitin, Said S. Samatar, Somalia: Nation in Search of a State, (Westview Press: 1987), p. 15.
  31. I.M. Lewis, A modern history of Somalia: nation and state in the Horn of Africa, 2nd edition, revised, illustrated, (Westview Press: 1988), p.20
  32. Brons, Maria (2003), Society, Security, Sovereignty and the State in Somalia: From Statelessness to Statelessness?, p. 116.
  33. Morgan, W. T. W. (1969), East Africa: Its Peoples and Resources, p. 18.
  34. Nehemia Levtzion; Randall Pouwels (2000). The History of Islam in Africa. Ohio University Press. p. 228. ISBN 978-0-8214-4461-0.
  35. "2007 Annual Report" (PDF). Range Resources. Archived from the original (PDF) on 21 March 2012. Retrieved 14 July 2012.
  36. "Oil and Gas Exploration and Production – Playing a Better Hand" (PDF). Range Resources. Archived from the original (PDF) on 17 October 2012. Retrieved 14 July 2012.
  37. Hadden, Robert Lee. 2007. "The Geology of Somalia: A Selected Bibliography of Somalian Geology, Geography and Earth Science." Engineer Research and Development Laboratories, Topographic Engineering Center
  38. Katsuyoshi Fukui; John Markakis (1994). Ethnicity & Conflict in the Horn of Africa. James Currey Publishers. p. 4. ISBN 978-0-85255-225-4.
  39. "Languages – Summary by country". Ethnologue.com. 19 February 1999. Archived from the original on 19 July 2013. Retrieved 25 July 2013.
  40. "Languages of Ethiopia". Ethnologue. SIL International. Archived from the original on 3 February 2013. Retrieved 9 February 2013.
  41. "Country Level". 2007 Population and Housing Census of Ethiopia. CSA. 13 July 2010. Archived from the original on 14 November 2010. Retrieved 18 January 2013.
  42. "Report for Selected Countries and Subjects". Imf.org. 14 September 2006. Archived from the original on 14 November 2017. Retrieved 25 July 2013.
  43. "Report for Selected Countries and Subjects". Imf.org. 14 September 2006. Archived from the original on 11 August 2020. Retrieved 25 July 2013.
  44. "Report for Selected Countries and Subjects". Imf.org. 14 September 2006. Archived from the original on 1 March 2021. Retrieved 25 July 2013.
  45. "The World Factbook". Cia.gov. Archived from the original on 12 June 2007. Retrieved 25 July 2013.
  46. 46.0 46.1 46.2 Pavanello, Sara 2010. [1] Archived 12 నవంబరు 2010 at the Wayback Machine. London: Overseas Development Institute
  47. Regulating the Livestock Economy of Somaliland (in ఇంగ్లీష్). Academy for Peace and Development. 2002.
  48. Project, War-torn Societies; Programme, WSP Transition (2005). Rebuilding Somaliland: Issues and Possibilities (in ఇంగ్లీష్). Red Sea Press. ISBN 978-1-56902-228-3.
  49. A Self-portrait of Somaliland: Rebuilding from the Ruins (in ఇంగ్లీష్). Somaliland Centre for Peace and Development. 1999.